టీచర్లకు టార్చర్‌- ఏ అంశం దొరికినా ముప్పేట దాడి‘ - టీచర్లకు ‘పాఠం’ చెప్పడానికే నోటీసుల అస్త్రం రూల్స్‌ పేరిట నోరుమూయించే ‘ఒత్తిడి’ వ్యూహం -బేస్‌లైన్‌లో పురోగతి లేకపోతే వేటేనని వార్నింగ్‌ సర్కారు ‘అతి’పై టీచర్లలో ఆగ్రహావేశాలు

  🔳టీచర్లకు టార్చర్‌

హాజరు, సమయపాలన, విద్యార్థుల ప్రతిభ...

ఇలా ఏ అంశం దొరికినా ముప్పేట దాడి‘

విలీనం’పై నిలదీతలతో సర్కారు ఉక్కిరిబిక్కిరి

టీచర్లకు ‘పాఠం’ చెప్పడానికే నోటీసుల అస్త్రం

రూల్స్‌ పేరిట నోరుమూయించే ‘ఒత్తిడి’ వ్యూహం

శ్రీకాకుళంలో 621మంది హెచ్‌ఎంలకు నోటీసులు

కర్నూలు, ప్రకాశం జిల్లాలకూ వెళ్లిన తాఖీదులు

బేస్‌లైన్‌లో పురోగతి లేకపోతే వేటేనని వార్నింగ్‌

సర్కారు ‘అతి’పై టీచర్లలో ఆగ్రహావేశాలు


రెండు నిమిషాలు పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని ఓ జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. పది నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు మరో ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేశారు. అనకాపల్లి జిల్లాలోని ఓ పాఠశాల నిర్వహణ సరిగా లేదన్న కారణంతో హెచ్‌ఎంకు నోటీసులు వెళ్లాయి. స్కూళ్లు బాగుపడాలని ఈ నోటీసులు ఇస్తే కొంత ‘అతి’గా చేసినా అర్థం చేసుకోవచ్చు. కానీ, అనాలోచిత సర్కారు విలీన చర్యలను నిలదీస్తున్న టీచర్లకు ‘పాఠం’ చెప్పాలనేదే సర్కారు ఉద్దేశమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

(అమరావతి-ఆంధ్రజ్యోతి)ఉపాధ్యాయులపై ప్రభుత్వం ముప్పేట దాడికి దిగింది. హాజరు, సమయపాలన, బేస్‌లైన్‌ పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ అంటూ ఏ కోణంలో విఫలమైనా చర్యలు తప్పవని హెచ్చరించింది. ఓవైపు పాఠశాలల విలీనానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు పోరాటం చేస్తుంటే, మరోవైపు నుంచి ప్రభుత్వం వారిపై ఒత్తిడి చేసే ప్రణాళిక అమలుచేస్తోంది. తద్వారా ప్రభుత్వ విధానాలను ప్రశ్నించకూడదని, పోరాటాలు, ఉద్యమాలకు తావివ్వకూడదని భావిస్తున్నట్టు సమాచారం. బేస్‌లైన్‌ పరీక్షల్లో ‘ప్రతిభ’ కనపరచలేదంటూ శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా 621 స్కూళ్ల హెచ్‌ఎంలకు ఆ జిల్లా విద్యాధికారి నోటీసులు జారీ చేశారు. ప్రకాశం, కర్నూలు జిల్లాలకూ భారీగా తాఖీదులు వెళ్లాయి. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు, సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమ వృత్తి జీవితంలో ఇంతటి ఒత్తిడిని ఎప్పుడూ ఎదుర్కోలేదని, ఒకప్పుడు ఉద్యమాలు చేసే స్థితి నుంచి ఇప్పుడు ప్రశ్నించేందుకు కూడా అవకాశం లేని దుస్థితికి చేరుకున్నామని పలువురు టీచర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

10.30కల్లా హాజరు వేయాలిఉదయం 10.30 కల్లా హాజరు పూర్తిచేసి, దానిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయులకు స్పష్టంచేసింది. ఆ సమయానికి ఆన్‌లైన్‌లో హాజరు నమోదుచేయని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు షోకాజు నోటీసులు జారీచేసి వివరణలు కోరుతోంది. ఈ క్రమంలో గురువారం కర్నూలు జిల్లాలో 280 పాఠశాలలకు నోటీసులు ఇవ్వగా వాటిలో ప్రభుత్వ పాఠశాలలు 90 ఉన్నాయి. అలాగే ప్రకాశం జిల్లాలో 15 పాఠశాలలకు నోటీసులు జారీచేశారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో 621 పాఠశాలలకు ఈ తరహా నోటీసులు జారీ అయ్యాయి. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడా నోటీసులు అందాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గతంలో హాజరుపై సమయపాలనపై కొంత వెసులుబాటు కల్పించారు. కానీ ఈ విద్యా సంవత్సరంలో ఉదయం 10.30కల్లా ఎట్టిపరిస్థితుల్లో స్టూడెంట్‌ అటెన్‌డెన్స్‌ యాప్‌లో కచ్చిటంగా నమోదుచేయాలని నిబంధన పెట్టారు. ప్రతిరోజూ ఉదయం 9.15గంటలకు మొదటి పీరియడ్‌ ప్రారంభమవుతుంది. ఆ పీరియడ్‌కు వెళ్లే టీచర్‌ తన సొంత మొబైల్‌లో ఈ స్టూడెంట్‌ అటెన్‌డెన్స్‌ యాప్‌లో లాగిన్‌ అయ్యి హాజరు వేయాలి. దాంతోపాటు మిడ్‌డే మీల్స్‌కు అదే హాజరును నమోదుచేయాలి. మాన్యువల్‌ రిజిస్టర్‌లోనూ హాజరు వేయాలి. సిగ్నల్‌ ఉన్నా లేకపోయినా ఈ ప్రక్రియను 10.30కు పూర్తిచేయాలి. పోనీ దీనికి ప్రభుత్వం ఫోన్లుగానీ, సిమ్‌లుగానీ ఇస్తుందా అంటే అదీ లేదు. మొదటి పీరియర్‌ తీసుకునే ఉపాధ్యాయుడు తన సొంత ఫోన్‌లోనే ఈ ప్రక్రియను పూర్తిచేయాలి. ఒకవేళ ఎవరైనా సీనియర్‌ టీచర్లు ఉండి.. తమకు స్మార్ట్‌ ఫోన్లు లేవన్నా, దాని గురించి తెలియదు అన్నా కుదరదు. దీంతో ప్రతిరోజూ ఉదయం దాదాపు అరగంట సమయం హాజరుకే సరిపోతోందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

టీచర్లకు ‘బేస్‌లైన్‌’ పరీక్షవిద్యార్థులకు ప్రాథమిక అంశాలపై అవగాహన కోసం ప్రభుత్వం బేస్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తోంది. కానీ ఇప్పుడా పరీక్ష విద్యార్థుల కంటే ఉపాధ్యాయులకు పరీక్షగా మారింది. 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు ప్రాథమిక పరిజ్ఞానాన్ని అంచనా వేసేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఫలితాలను ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో నమోదుచేయాలి. ఆగస్టు 15 నుంచి డీఈవోలు, ఎంఈవోలు పాఠశాలలను తనిఖీ చేసినప్పుడు గతంలో వచ్చినప్పటికంటే విద్యార్థుల పనితీరు మెరుగుపడాలి. అప్పటికీ తక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల్లో ఎలాంటి మార్పు లేకపోతే సంబంధిత ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయాలని పాఠశాల విద్య కమిషనర్‌ ఆదేశాలు జారీచేశారు. ఇన్ని ఒత్తిళ్ల మధ్య విద్యార్థుల్లో మార్పు రాకపోతే తామేం చేయాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కారణాలతో ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేస్తే మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉంటుందని ఆవేదన చెందుతున్నారు. 

ఒత్తిళ్లపై అనుమానాలుపాఠశాలల రేషనలైజేషన్‌ విధానాన్ని ఉపాధ్యాయులు తొలినుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. పలుచోట్ల విలీనానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు చేస్తున్న ఉద్యమాలకు ఉపాధ్యాయుల సహకారం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. సంఘాలు కూడా జీవో 117ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో విలీనం విషయంలో ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఉపాధ్యాయ పోస్టులు తగ్గించి ఆర్థిక భారం తగ్గించుకునేందుకు, కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వకుండా ఉండేందుకే విలీనాలకు దిగారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యతిరేకతను తగ్గించుకునే క్రమంలో ఇతర అంశాలపై ఉపాధ్యాయులను ఒత్తిళ్లకు గురిచేసి, తద్వారా అసలు సమస్యలను మరుగుపరచాలని ప్రభుత్వం చూస్తోందని సంఘాలు అనుమానిస్తున్నాయి.

తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం - టి ఎన్ యు ఎస్ #TNUS #MANNAM #MANNAMSRINIVAS #TNUSAP #APTNUS #మన్నం #మన్నంశ్రీనివాస్ #తెలుగునాడు #TeluguNadu #తెలుగునాడుఉపాధ్యాయసంఘం #TeluguNaduUpadhyayaSangham #TNUS #టీఎన్‌యూఎస్ #Noble Teachers Association #NTA#నోబుల్ టీచర్స్ అసోసియేషన్

కేసులు పెట్టించండిడీఈవోలకు కమిషనర్‌ డైరెక్షన్‌

పాఠశాలల్లోని తరగతుల విలీనానికి సంబంధించి ప్రచురితమయ్యే వ్యతిరేక వార్తలను సీరియ్‌సగా తీసుకోవాలని పాఠశాల విద్య కమిషనర్‌ సురే్‌షకుమార్‌...డీఈవోలను ఆదేశించారు. దీనిపై శుక్రవారం ఉదయం డీఈవోలతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘‘ప్రతి వ్యతిరేక వార్తను పరిశీలించాలి. అందులో ఏమాత్రం ఉద్దేశపూర్వకంగా రాసినట్లున్నా, తప్పులు రాసినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. సంబంధిత పాఠశాల ఉపాధ్యాయుల ద్వారా ఈ ఫిర్యాదులు చేయించాలి’’ అని ఆదేశించారు. 

నోటీసులను ఉపసంహరించుకోవాలి: ఏపీటీఎఫ్‌

సమయానికి హాజరు వేయలేదనే కారణంలో హెచ్‌ఎంలకు నోటీసులు జారీచేయడాన్ని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య ఖండించింది. వెంటనే ఆ నోటీసులు  ఉపసంహరించుకోవాలని సమాఖ్య అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు సీహెచ్‌ మంజుల, కే భానుమూర్తి ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. అలాగే బేస్‌లైన్‌ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు రాకపోతే ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయాలని ఆదేశించడం సరికాదన్నారు. విద్యార్థులందరి ఐక్యూ ఒకే తరహాలో ఉండదని, దానికి ఉపాధ్యాయులను బాధ్యుల్ని చేయడం ఏంటని ప్రశ్నించారు.

యాప్‌ల ఒత్తిడి తగ్గించాలి: టీఎన్‌యూఎస్‌

పాఠశాలల్లో ఉపాధ్యాయులపై బోధన కంటే యాప్‌ల ఒత్తిడి ఎక్కువ భారంగా మారిందని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్‌, శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. హాజరు నమోదు, జేవీకే కిట్ల పంపిణీకి ఎక్కువ సమయం పడుతోందన్నారు. నిత్యం యాప్‌ల పనులతో ఉపాధ్యాయులు ఇంటి వద్ద కూడా పనిచేయాల్సి వస్తోందని, వెంటనే యాప్‌ల ఒత్తిడిని తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

No comments

Powered by Blogger.