JVK ఏకరూపదుస్తులు రెండు జతలే అందాయి... బూట్లు, బ్యాగుల్లో నాణ్యత లోపమే.. విజిలెన్స్, ఎన్స్‌ఫోర్సుమెంట్ తనిఖీల్లో బహిర్గతం
✍️ఏకరూపదుస్తులు రెండు జతలే అందాయి
♦️మూడు జతలకు చాలని వస్త్రం
♦️బూట్లు, బ్యాగుల్లో నాణ్యత లోపమే
♦️విజిలెన్స్, ఎన్స్‌ఫోర్సుమెంట్ తనిఖీల్లో బహిర్గతం
🌻ఈనాడు, అమరావతి: ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు అందించిన ‘జగనన్న విద్యా కానుక’ డొల్లతనం విజిలెన్స్, ఎన్‌ఫోర్సుమెంట్ తనిఖీల్లో బయటపడింది. ఎంతో పకడ్బందీగా.. నాణ్యమైన వాటిని అందిస్తున్నామని ఇప్పటివరకు అధికారులు చెప్పిన మాటలు అవాస్తవమని తేలిపోయింది. మూడు జతల ఏకరూపదుస్తులకు వస్త్రం ఇవ్వగా.. దానిని విద్యార్థులు కుట్టించుకుంటే రెండింటికే సరిపోయింది. చినిగిపోయిన బ్యాగులను వెనక్కి ఇస్తే విద్యార్థులకు కొత్తవి ఇవ్వలేదు. సరిపడా సైజులతో బూట్లను అందించలేదు. వాటిని తిరిగి ఇచ్చేయగా.. అవి బడుల్లోనే మూలుగుతున్నాయి. బూట్ల నాణ్యత సరిగా లేదని విజిలెన్స్ గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం 57 పాఠశాలల్లో జగనన్న విద్యా కానుక, 54 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై తనిఖీలు నిర్వహించింది. ప్రకాశం, అనకాపల్లి, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో దుస్తుల కుట్టుకూలి సక్రమంగా ఇవ్వలేదని, విద్యార్థులకు అందించిన బ్యాగు పరిమాణం సరిగా లేదని, చిన్న బ్యాగులు ఇవ్వడంతో అన్ని పుస్తకాలు వాటిల్లో పట్టడం లేదని గుర్తించింది.
♦️పాఠ్యపుస్తకాలే ఇవ్వలేదు
చాలా పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సక్రమంగా అందలేదు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లొలుగు హైస్కూల్‌లో 44మంది విద్యార్థులకు హిందీ, అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆరిపాకలో తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఆంగ్ల, తెలుగు మాధ్యమం, నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందివర్గంలో ఆరోతరగతికి సామాన్యశాస్త్రం, ఎనిమిదో తరగతికి గణిత పాఠ్యపుస్తకాలు నేటికీ పంపిణీ చేయలేదు.
♦️గుడ్లు సరిపడా లేవు..
కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా కోడిగుడ్లు లేవు. సరఫరాలో ఆలస్యంగా కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. బాపట్ల జిల్లా కారంచేడు మండలం దగుబాడు ఎంపీపీ పాఠశాల, అనంతపురం గ్రామీణ మండలం పాపంపేట జడ్పీహెచ్‌ఎస్, ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం చింతపాడు జడ్పీఎస్‌ఎస్‌లో ఈ దుస్థితి నెలకొంది. లింగపాలెం మండలం ధర్మాజీగూడెం పాఠశాలల్లో కోడిగుడ్లతో పాటు చిక్కీల కొరత ఏర్పడింది. అది చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో కోడిగుడ్లు, చిక్కీలు ఎక్కువగా నిల్వ చేశారు. బియ్యం సంచులపై మధ్యాహ్న భోజనం లోగో ముద్రలు వేయడం లేదు. వంట గదులు అపరిశుభ్రంగా ఉన్నాయి. చాలా పాఠశాలలను ఉన్నతాధికారులు తనిఖీ చేయడం లేదు.
No comments