Pele Death: లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ పీలే ఇకలేరు.. శోకసంద్రంలో క్రీడా ప్రపంచం
Pele Death: లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ పీలే ఇకలేరు.. శోకసంద్రంలో క్రీడా ప్రపంచం
Pele Passed Away: బ్రెజిలియన్ గ్రేట్ ఫుట్‌బాల్ ప్లేయర్ పీలే (82) ఇకలేరు. ఈ దిగ్గజ ఆటగాడు గత కొద్దిరోజులుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు.
గురువారం సావో పాలోలోని ఐన్‌స్టీన్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. పీలే ఏజెంట్ జో ఫ్రాగా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆయన మరణంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ ఫ్యాన్స్ శోకసంద్రంలో మునిగిపోయారు. అభిమానులు సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు.
1958, 1962, 1970లలో ఫిఫా ప్రపంచ కప్‌ను మూడుసార్లు గెలిపించిన ఏకైక ఆటగాడు పీలే. పీలే మరణం ఫుట్‌బాల్ ప్రేమికులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సోషల్ మీడియాలో అభిమానులంతా ఫుట్‌బాల్ హీరోకి చివరి వీడ్కోలు పలుకుతున్నారు. ఇటీవల ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో ఓటమి పాలైనప్పటికీ.. మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసి ఫ్రెంచ్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు కైలియన్ ఎంబాప్పే ట్వీట్ చేసి అతనికి నివాళులర్పించాడు. మరణవార్త తెలుసుకున్న మెస్సీ కూడా పీలే మరణానికి సంతాపం తెలిపారు. ఆయన మరణం తరువాత పీలే అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది.
పీలే 1940 అక్టోబర్ 23న బ్రెజిల్‌లోని ట్రెస్ కొరాకోస్ అనే చిన్న పట్టణంలో జన్మించారు. తన తండ్రి నుంచి ఫుట్‌బాల్ ఆట నేర్చుకున్నాడు. ఆయన సెమీ-ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడు. అయితే మోకాలి గాయం కారణంగా కెరీర్‌ని మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. అయినా తన కలను వదులుకోకుండా కొడుకు పీలేను అత్యుత్తమ ఆటగాడిగా తీర్చిదిద్దారు. ప్రపంచంలోనే లెజండరీ ఫుట్‌బాల్ ఆటగాళ్లలో ఒకరైన పీలే తన అద్భుతమైన ఆటతో రెండు దశాబ్దాల పాటు క్రీడా ప్రేమికులను అలరించారు.
మైదానంలో అతని విన్యాసాలకు కోట్లాదిమంది మంత్రముగ్దులయ్యారు. బ్రెజిలియన్ జాతీయ జట్టుతో పాటు బ్రెజిలియన్ క్లబ్ శాంటోస్ జట్ల తరఫున ఆడారు. మొత్తం కెరీర్‌లో 1366 మ్యాచ్‌ల్లో మొత్తం 1281 గోల్స్ చేశారు. ఆయన గోల్ సగటు ప్రతి మ్యాచ్‌కు 0.94. ఇది ఫుట్‌బాల్ ప్రపంచంలో ఇప్పటికీ అత్యుత్తమంగా ఉంది. ప్రపంచలోనే మూడుసార్లు ప్రపంచకప్ గెలిచిన ఏకైక ఆటగాడు పీలే.
No comments