AP News - సమయానికి జీతాలిచ్చేలా చట్టం చేయాలి .. ప్రభుత్వమే మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే దిక్కెవరు?

  ✍️సమయానికి జీతాలిచ్చేలా చట్టం చేయాలి

♦️ప్రభుత్వమే మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే దిక్కెవరు?

♦️గవర్నర్‌ను కోరిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

♦️జీతభత్యాల కోసం గవర్నర్‌ వద్దకు వెళ్లడం దేశంలో ఇదే ప్రథమమని వెల్లడి

♦️ఏప్రిల్‌లో ఉద్యమానికి సిద్ధం కావాలని ఉద్యోగులకు పిలుపు



*🌻ఈనాడు, అమరావతి*: ‘ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతభత్యాలు అందేలా చట్టం చేయాలి. ఈ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించాలి’ అని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ కోరారు. గురువారం సంఘం ప్రతినిధులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. అనంతరం రాజ్‌భవన్‌ వద్ద సూర్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఉద్యోగులకు జీతభత్యాలు, డీఏ, పీఆర్సీ బకాయిలు, పీఎఫ్‌ క్లెయిమ్‌లు, మెడికల్‌ క్లెయిమ్‌లు సకాలంలో ఇవ్వకపోవడంపై గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేయడమనేది దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఉద్యోగ, పెన్షనర్ల చరిత్రలో ఇదో నూతన అధ్యాయానికి తెరదీసిన రోజుగా భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ‘ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం సుమారుగా రూ.10వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల చెల్లింపులు జరపాల్సి ఉంది. ఈ బకాయిలు ఇవ్వకపోగా... కనీసం పేరుకుపోయిన ఆ మొత్తం ఎంతుందో చెప్పడం లేదు. సమాచార హక్కు చట్టం కింద కోరినా సమాధానం లేదు. అవి ఎప్పుడు చెల్లిస్తారు? జీపీఎఫ్‌ ఖాతాల నుంచి డెబిట్‌ చేసిన మొత్తాన్ని ఎప్పుడు జమ చేస్తారో ఒక ప్రణాళికను వెల్లడించాలని కోరినా ప్రభుత్వం ప్రకటించడం లేదు’ అని వివరించారు.

♦️ప్రభుత్వ ఆదాయంలో ఉద్యోగులదే తొలి హక్కు

‘గ్రామ పంచాయతీల ఆదాయంలో మొదటి హక్కుదారులుగా పంచాయతీ ఉద్యోగులను గుర్తించి వారికి జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అదే తరహాలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మీద మొదటి హక్కుదారులుగా ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులను గుర్తించి వారి క్లెయిమ్‌లను పరిష్కరించేలా చట్టం చేయాలని గవర్నర్‌ను కోరాం. ఇప్పటికే స్పష్టమైన నిబంధనలున్నా.. ప్రభుత్వం వాటిని ఉల్లంఘిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఉల్లంఘిస్తే ఏం చేయాలనేది అందులో లేదు. అంతేగాక చట్టానికి ఉండే అధికారం ఆ నిబంధనలకు లేదు. అందుకే.. ఉల్లంఘనలపై శిక్షపడేలా చట్టం చేయాలని కోరాం. ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌కు విన్నవించాం. మమ్మల్ని నిస్సహాయ స్థితిలోకి నెట్టి వేయడంతో రక్షించండని గవర్నర్‌ను కోరాం. ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలు, ఖాతాల నిర్వహణకు కొన్ని స్వీయ మార్గదర్శకాలను అడాప్ట్‌ చేసుకున్న ‘కోడ్‌’నూ గవర్నర్‌కు నివేదించాం. నిబంధనల ప్రకారం వేతనాలన్నింటినీ నెల చివరి రోజుగానీ, మరుసటి నెల తొలిరోజుగానీ చెల్లించాలి. విశ్రాంత ఉద్యోగుల లబ్ధినీ 24 గంటల్లోగా చెల్లించకపోతే.. ఆలస్యమైన కొద్దీ 4.5 శాతం వడ్డీని కారకుడైన అధికారి జీతం నుంచి ఇవ్వాలనే మార్గదర్శకాలున్నాయి. వీటన్నింటినీ ప్రభుత్వమే ఉల్లంఘిస్తోంది. ప్రైవేటుకు మార్గదర్శకంగా ఉండాల్సిన ప్రభుత్వమే ఇలా చేస్తోంది. అందుకే గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లాం’ అని వెల్లడించారు.

♦️ఇక పోయేదేముంది.. ఏప్రిల్‌లో ఉద్యమమే

‘ఉద్యోగుల సమస్యలపై మేం ఉద్యమం చేద్దామంటే ప్రభుత్వం నిర్బంధం విధిస్తోంది. సంఘాల్లో చీలిక తెస్తోంది. కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు వచ్చి.. ముఖ్యమంత్రి ఏరియర్స్‌ అన్నీ ఇస్తారని చెబుతూ ఉద్యమంపై నీళ్లు చల్లుతున్నారు. ప్రభుత్వ ఆడిస్తున్న ఆటలో ఉద్యోగులు బలవుతున్నారు. వేతన సవరణ సందర్భంగా గత జనవరి 7న ఉద్యోగుల 77 డిమాండ్లను పరిష్కరించినట్లు సీఎం చెప్పారు. సర్వీసు ప్రయోజనాలు, ఆర్థిక సమస్యల్లో ఒక్క దాన్నీ ప్రభుత్వం పరిష్కరించలేదు. ఏ నెల జీతం ఆ నెల ఇవ్వండని దేబిరించే స్థితికి చేరాం. ఇంతకంటే పోయేదేముంది. ఇంకా ఉద్యోగులు మీనమేషాలు లెక్కపెట్టాల్సిన అవసరం లేదు. ఏప్రిల్‌లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం చేపట్టబోయే ఆందోళనకు సమాయత్తం కావాలని కోరుతున్నా’ అని సూర్యనారాయణ పిలుపునిచ్చారు. గవర్నర్‌ను కలిసిన వారిలో సంఘం ప్రధాన కార్యదర్శి జి.ఆస్కారరావు ఇతర ప్రతినిధులున్నారు.

♦️ప్రభుత్వంపై కేసుపెడతాం

మా అనుమతి లేకుండా మా జీపీఎఫ్‌ ఖాతా నుంచి ప్రభుత్వం గత మార్చిలో దాదాపు రూ.500 కోట్లను తీసుకోవడమనేది విచారించదగ్గ నేరం. సొమ్మును తిరిగి జమ చేయడంతోపాటు, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై ఆర్థికశాఖ అధికారులు, సీఎస్‌, ఆర్థిక మంత్రి, మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు, సలహాదారులు.. ఇలా అందరికీ వివరించాం. ఇటీవల ఉద్యోగ సంఘాల డైరీల ఆవిష్కరణ పేరుతో సీఎం దర్శనానికి మమ్మల్ని ఆహ్వానిస్తే అప్పుడూ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పటివరకూ ఎలాంటి హామీ రాలేదు. జీపీఎఫ్‌ ఖాతాల నుంచి సొమ్ము తీసినందుకు అప్పట్లోనే పోలీసు కేసు పెట్టాలని ప్రయత్నించాం. సాంకేతిక పొరపాటువల్ల జరిగిందని తెలిపారు. విచారించి నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఆ నివేదిక ఇప్పటికీ రాలేదు. న్యాయ నిపుణులను సంప్రదించి దీనిపై కేసు పెడతాం. ఇప్పటికే కాగ్‌కు ఫిర్యాదు చేశాం.

▪️ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ

 


🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

No comments

Powered by Blogger.